మనం చేసే తప్పులకు మన బాధ్యత ఎంతవరకు ఉంటుంది?

బుద్ధి కర్మానుసారిణీ... అంటారు. అంటే గతజన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది. ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వ జన్మలో ఇంతకుమించిన పాపఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం. ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్న వారు గత జన్మలో సత్కార్యాలు చేసిఉంటారు.

కానీ పైజన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు. ఈ కర్మఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని. కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకుని విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం, శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అందుకే ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేస్తే మరుజన్మకు పుణ్యం సంపాదించుకోగలరు. మనం చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత మనదే.